సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు చీకటి రోజు
సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజలకు చీకటి రోజు
సూర్యాపేట, ఆర్ పి న్యూస్ :
తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని హంతక దినం సెప్టెంబర్ 17,1948 నిజాంతో కుమ్మక్కైన నెహ్రూ-పటేల్ ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం సాకుతో 50వేల సైన్యంతో ప్రజలపై దండయాత్ర జరిపి దాడి చేసిన రోజది. ఈ చీకటి దినాన్ని విలీనమని,విమోచనమని,విముక్తి అని వివిధ పక్షాలు ప్రకటిస్తున్న తెలంగాణ ప్రజలపై దాడిగానే భావించాలి అని డాక్టర్ ఆరుట్ల జానకి రెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్) స్పష్టం చేశారు.నేడు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆనాడు దేశంలో ఉన్న 565 హిందూ-ముస్లిం భూస్వామ్య సంస్థానాలన్నీ నిరంకుశంగా ప్రజలను, ఆదివాసులను బ్రిటిష్ సామ్రాజ్యవాదుల సైనిక బలం మీద ఆధారపడి హింసించాయి.ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో భూస్వామ్య దోపిడీ, వెట్టి, నిర్బంధ వసూళ్లు, కౌలు సమస్య,మహిళపై లైంగిక దాడులు వంటి సమస్యలపై ప్రారంభమైన ప్రజా ఆందోళనలు భూమి పంపిణీతో ముడిపడ్డ రాజ్యాధికార సాయుధ పోరాటంగా బ్రద్దలైంది. పోలీస్ చర్య పేరుతో సైన్యాలు దాడి జరిగే నాటికి కమ్యూనిస్టుల సాయుధ పోరాట దాటికి నిజాం ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఉంది.రెండు వేల గెరిల్లా సైన్యం, లక్షల మంది గ్రామ వాలంటీర్లు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొంటున్నారు.
మూడు వేల గ్రామాలు విముక్తమయ్యాయి. 10 లక్షల ఎకరాలు పేద రైతాంగానికి, కూలీలకు పంచబడ్డాయి. ఈ పోరాటం ఇతర ప్రాంతాలకు విస్త రిస్తున్న సందర్భంలో సంస్థానపు అధిపతి బడా భూస్వామి అయిన నిజాం తన పాలనకు పునాదిగా ఉన్న జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు ప్రజా పోరాట ఉధృతికి తట్టుకోలేక వీరిలో అనేకులు గ్రామాలను వదిలి పారిపోయారు. నిజాం-కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం ప్రకారం, కమ్యూనిస్టులు వారి ఆధ్వర్యంలో పోరాడుతున్న ప్రజలే దాడికి లక్ష్యమయ్యారు.దాడికి ముందు 1500 మంది మాత్రమే చనిపోతే దాడి అనంతరం 2500 మంది కమ్యూనిస్టులను సైన్యం అతి క్రూరంగా చంపివేసింది. పదివేల మంది నిర్బంధ క్యాంపులలో చిత్రహింసల వల్ల చనిపోయారు. లక్షలాది మంది జైళ్ళ పాలయ్యారు. లైంగిక దాడులు, ఆస్తుల ధ్వంసం అడ్డు అదుపు లేకుండా కొనసాగాయి. దాదాపు రెండు లక్షల మందిని హతమార్చిన రోజు విమోచన ఎలా ఎలా అవుతుంది? యూనియన్ సైన్యాల అండతో గ్రామాల్లోకి తిరిగి వచ్చిన భూస్వాములు, ప్రైవేట్ సైన్యాలు, ఆర్య సమాజ్, కాంగ్రెస్ వాలంటీర్లు మూడు సంవత్సరాల పాటు సాగించిన ఘోరమైన నేరాలన్నీ తెలంగాణ పీడిత ప్రజలు సాగిస్తున్న విమోచన పోరాటాన్ని ధ్వంసం చేయడానికి జరిగిన దాడి అని భావించి ప్రజలు ప్రతిగటించారనేది దాచేస్తే దాగని సత్యం. విస్తరిస్తున్న ఈ ప్రజా పోరాటం దేశంలోని బడా భూస్వాములు- పెట్టుబడిదారుల నియంతృత్వానికి సవాల్ గా విసురుతుంది అనే గ్రహింపుతోనే జరిగిన దాడి ఇది.కావున ఎంత మాత్రం విమోచన కాదు, విముక్తి కాదు, విధ్వంసకపూరితమైన ప్రజలకు తలపెట్టిన ద్రోహం. నిజాంను 1950 జనవరి 26వ తేదీన రాజ ప్రముఖ్ గా గుర్తించి అతని ఆస్తులకు రక్షణ కల్పించి, రాజభరణాలు, సర్పేఖాన్ భూములకు నష్టపరిహారం, రజకార్ మూకల అధిపతి ఖాసీం రాజ్వీని క్షేమంగా దేశం నుంచి పంపించారు,పారిపోయిన భూస్వాములను గ్రామాల్లోకి అనుమతి ఇచ్చారు.ప్రజలపై,వారు సాధించుకున్న విజయాలపై దాడులు చేశారు. నేటికి తెలంగాణలో ఇవే విధానాలు కొనసాగుతున్నాయి. రేవంత్ సర్కార్ కూడా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపాలనే పిలుపును ఖండిస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వ పాలన కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక ” నిరంకుశ, నియంతృత్వ, నిర్భంధ,హంతక దళారీ భూస్వామ్య పాలనే”అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, రైతాంగ వేదిక రాష్ట్ర నాయకులు నల్లెడ మాధవరెడ్డి, గుండాల సందీప్ (విద్యార్ధి వెదిక) బహుజన మహసభ రాష్ట్ర నాయకులు వేంకట్ యాదవ్, అబ్దుల్ కరీం (CUC), నాగేందర్ నాయక్ (LHPS) జిల్లా అధ్యక్షులు, కోటయ్య (తెలంగాణ ప్రజా ఫ్రంట్) లు పాల్గొన్నారు.