ఎన్టీఆర్ ,రామోజీరావు ఇద్దరూ ఇద్దరే:సీఎం చంద్రబాబు నాయుడు

0

ఎన్టీఆర్ ,రామోజీరావు ఇద్దరూ ఇద్దరే

అమరావతి లో రామోజీ విజ్ఞాన్ కేంద్రం ఏర్పాటు

విశాఖలో రామోజీ చిత్రనగరి 

రామోజీ రావు సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు నాయుడు 

అమరావతి, హైదరాబాద్, ఆర్ పీ న్యూస్:

వ్యాపార రంగంలోనూ ప్రజాహితాన్ని చూసిన ఏకైక వ్యక్తి రామోజీరావు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. కానూరు అనుమోలు గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు తన సతీమణి భువనేశ్వరితో కలిసి సీఎం చంద్రబాబు హాజ‌ర‌య్యారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన రామోజీరావు చిత్రపటానికి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ ,రామోజీరావు ఇద్దరూ ఇద్దరేన‌ని వీరికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని సీఎం ఆకాంక్షించారు. ప్ర‌జారాజ‌ధానికి అమరావతి పేరు సూచించిన రామోజీరావు ని గుర్తు చేసుకుంటూ రాజ‌ధానిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌న్నారు. రాజధానిలో ఏదైనా ఒక రహదారికి రామోజీరావు మార్గం అని పేరు పెడతామ‌ని, విశాఖలో చిత్రనగరికి రామోజీ చిత్రనగరిగా పేరు పెడతామ‌ని సీఎం ప్ర‌క‌టించారు.
తెలుగుజాతికి రామోజీ రావు చేసిన సేవలకు గానూ తగిన గుర్తింపు రావాలి. ఎన్టీఆర్‌, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రామోజీరావు ప్రజల ఆస్తి. ఆయన స్థాపించిన వ్యవస్థలను భావితరాలకు అందించాలి. ఎన్టీఆర్‌, రామారావు ఇద్దరూ యుగపురుషులు.అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఒక రోడ్డుకు రామోజీ మార్గం అని పేరు పెడతాం. విశాఖలో రామోజీ చిత్రనగరి అని ఏర్పాటు చేస్తాం అని సీఎం పేర్కొన్నారు.

రామోజీ ని వేధించారు: డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్
రామోజీ ని వేధించారు అని, పత్రికని ఇబ్బంది పెట్టారని,కుటుంబాన్ని వేధించారు అని డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ తట్టుకుని నిలబడ్డారు అని . ఈ కక్షలకు ఆయన నలిగిపోయి ఉన్నా, ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిసి, ఎన్నికల ఫలితాల రోజు విజయ వార్త విన్నారో లేదో అని ఫోన్ చేశా.. ఏపి విజయాన్ని ఆయన సంపూర్ణంగా ఆస్వాదించారని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నించాలన్న విషయం రామోజీరావు నుంచి నేర్చుకోవాలి అని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.
చనిపోయినా రామోజీరావులానే ఉండాలి : సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి
కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ తన మరణాన్ని ఆపారు. అదేవిధంగా తాను ఎంతో ప్రేమించే ఆంధ్రప్రదేశ్‌ కబంధ హస్తాల నుంచి బయటపడటం చూసి అప్పుడు నిష్క్రమించారు. బతికినా, చనిపోయినా రామోజీరావులానే ఉండాలి అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి తెలిపారు.

జీవితకాల పోరాటం చేశారు : సినీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి
ఏ పని అయినా కష్టాన్ని ఇష్టంగా చేయమనేవారు అని
సినీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి తెలిపారు.సాధారణ రైతు కుటుంబంలో పుట్టి తన జీవితాన్ని తానే రాసుకున్నారు. కఠోరమైన క్రమశిక్షణతో ఒక్కో మెట్టు ఎక్కారు. రామోజీరావు గొప్ప మానవతావాది. ఆయన నీడలో 40వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వేల మందికి ఉపాధి కల్పించి వాళ్ల బాగోగులు చూసుకున్నారు.
సమాజంలో మార్పు కోసం కలాన్ని ఆయుధంగా చేసుకుని జీవితకాల పోరాటం చేశారు అని సినీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *