పండుగ అంటే మార్కెట్ చేస్తున్న విధ్వంసమా?:జంపన్న

0

పండుగ అంటే మార్కెట్ చేస్తున్న విధ్వంసమా? 

                                  (జంపన్న)

ఆర్ పి న్యూస్, సంపాదకీయం 

గణేష్ ఉత్సవాల నష్టం

గతంలో లేని ప్రాధాన్యత జాతీయ ఉద్యమ సందర్భంగా బాలగంగాధర్ తిలక్ నినాదం మూలంగా వినాయక చవితి విస్తృతం అయ్యింది. ఒకప్పుడు నగరాలకు వ్యాపారులకు సంపన్నులకు మాత్రమే పరిమితమైన గణేష్ నిమజ్జనం గత 30 సంవత్సరాల నుండి దేశవ్యాప్తమైంది. అన్ని వర్గాలు అన్ని కులాలు ఈ పండుగలో పాల్గొంటున్నాయి.

అన్ని ఆటలను వెనుక్కు నెట్టేసి క్రికెట్ ఆట ఆధిపత్యం వహించినట్టుగా హిందువుల పండుగలను అన్నింటిని నెట్టివేసి వినాయక చవితి పండుగ విస్తృతమైంది.

భూస్వామ్య వ్యవస్థ బలంగా కొనసాగిన కాలంలో పండుగల పట్ల పవిత్రత దైవభక్తి ఎక్కువ. కానీ గత కొన్ని సంవత్సరాలుగా వినాయకుని పండుగ అంటే త్రాగుడు డ్యాన్సులతో వెర్రి తలలు వేస్తూ పెట్టుబడి దారి సంస్కృతి విస్తృతమైంది.

వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం నీరు కాలుష్యం పెరిగిపోయి మానవ సమాజానికి తీవ్రమైన గుదిబండగా మారుతున్నది.ప్రజల ఆరోగ్యాలపై, ట్రాన్స్ పోర్టింగ్ పై ప్రభావం చూపుతున్నది అన్ని రకాల వ్యవస్థల అస్తవ్యస్తతకు సంపద నాశనానికి కారణాలు అవుతున్నది.

వినాయక చవితి కార్యక్రమాలలో సాధారణ ప్రజలు విస్తృతంగా పాల్గొంటున్నప్పటికీ బ్రాహ్మణ పూజారులు , పెట్టుబడి దారి వ్యాపార వర్గాలు మీడియా రాజకీయ నాయకుల ప్రోత్సాహము కీలకమైనది. ప్రజల వెనుకబాటుతనాన్ని ఈ వర్గాలు వాడుకుంటున్నాయి.

దేవుడు,దయ్యాలు వున్నయా?

దేవుడు ఏ ప్రాణిని పుట్టించడం చంపడం భ్రమ మాత్రమే తప్ప భౌతికమైనది కాదు. కానీ మనిషి ప్రాణం లేని రాతి బొమ్మకు జన్మ దినాలు పెండ్లి దినాలు లెక్కలేనన్నిసార్లు చేస్తూ కల్పనా ప్రపంచంలో మునిగి తేలడం జరుగుతున్నది.

ప్రతి కల్పిత కథ సైతం ఒక ఆర్థిక పునాది నుండి అల్లబడిన సాంస్కృతిక భావజాలమే. ఎలాంటి ఆర్థిక పునాది లేకుండా దాని కదే సాంస్కృతిక భావజాలం ఆకాశం నుండి ఊడి పడదు.

సింధు నాగరికత ధ్వంసమైన తర్వాత క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితం చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా పాలకవర్గాలైన క్షత్రియ బ్రాహ్మణులు శూద్రులపై కొనసాగించిన శ్రమ దోపిడి ,అణిచివేత వివక్షతలను కొనసాగించడానికి మాత్రమే వేదాలు రచించ బడినాయి. ఆర్థిక దోపిడిని రక్షించుకోవడానికి సైన్యం రాజ్యాంగం మతం జైళ్ళు కోర్టులు ఆవిర్భవించినవి

చాతుర్ వర్ణ వ్యవస్థ రూపంలో ఉన్న బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా చార్వాకులు పోరాటాన్ని కొనసాగించారు. ఈ క్రమంలోనే బౌద్ధమతం జైన మతం ఆవిర్భవించినాయి. బౌద్ధ మతానికి కౌంటర్ గా రామాయణం మహాభారతం వగైరా కల్పిత కథలు రచించబడినవి. ఆనాటి నుండి ఈ కల్పిత కథలకు అనేక కల్పనలు జోడించబడినవి.

ఒక కవి ఒక శిల్పాకారుడు ఒక సినిమా డైరెక్టర్ ఏ రకంగా నైనా తన కాలంలోని విషయాల ఆధారంగా పురాణాలకు లంకె కలపవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన కలికి సినిమా అలాంటిదే .

మనిషికి సత్యాలు చేదుగా వుంటే, అనేక వైరుధ్యాలతో కూడిన కల్పనలు రంజుగా తీయగా మత్తుగా ఉంటాయి. అందుకోసమే కారల్ మార్క్స్ “మతం మత్తు మందు” అన్నాడు.

ప్రాణులే దైవాన్ని సృష్టించారు

అనంతకోటి జీవరాశుల్లో ఒక శాతం కూడా లేని మనిషి తప్ప, మరే ప్రాణీ దేవుడ్ని గానీ, మతాన్ని గానీ ఖాతరు చెయ్యవు!అంటే మతం అనేది స్పష్టంగా మనిషి తాలూకూ బిజినెస్ మాత్రమే. మానవుడే దేవుడిని సృష్టించుకున్నాడు. దోపిడి వర్గాల సృష్టి మతం. ఆ మతాలు కోట్ల దేవతలను సృష్టించినారు.

“ప్రకృతితో సాగించిన యుద్ధంలో ఆదిమానవుడి వెనుక బాటు తనం అసమర్థత దేవుళ్ళు దయ్యాలు మంత్ర తంత్రాల లాంటి వాటిపై విశ్వాసానికి దారితీసింది “లెనిన్.

దోపిడి వర్గాలే మత సృష్టికర్తలు..

వర్గ సమాజం ఏర్పడినప్పటి నుండి వివిధ సమాజాలలో పాలకులు అయిన బానిస యజమానులు భూస్వాములు నేడు పెట్టుబడిదారులు అధిక సంఖ్యకులైన శ్రామిక వర్గ ప్రజల పై దోపిడిని అణిచివేతను కొనసాగించడానికి మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆ మత భావజాలమే లేకపోతే అధిక సంఖ్యకులైన శ్రమజీవులు అల్ప సంఖ్యకు లైన దోపిడి వర్గాలను నిర్మూలించగలిగేవి.

నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో గుళ్ళు మసీదులు చర్చిలు పూర్తి వ్యాపార ప్రయోజనాలతో విస్తరిస్తున్నాయి. వ్యాపారానికి తోడు రాజకీయ ప్రయోజనాలు బలంగా అభివృద్ధి అయినాయి.ఫ్యూడల్ సమాజంతో పోలిస్తే పెట్టుబడిదారీ వ్యవస్థ 20 రెట్లు అధికంగా మత, కుల భావోద్వేగాలను రగిలిస్తున్నవి. వీరికి ప్రజల ఆరోగ్యాల పట్ల పర్యావరణ పట్ల విషపూరిత సంస్కృతి పట్ల ఎలాంటి నీతి నియమాలు లేవు.

మతం పట్ల భౌతిక వాదులు..

వర్గ సమాజ ప్రారంభంలోనే చార్వాకులు దైవ భావనకు వ్యతిరేకంగా భౌతిక వాదంతో గొప్ప వర్గ పోరాటం చేసిన చరిత్ర ఉంది . భారతదేశంలో ఆనాటి నుండి నేటి వరకు భౌతిక వాదులు బావ వాదానికి వ్యతిరేకంగా సంఘర్షణ కొనసాగిస్తున్నారు. నేటి ఆధునిక సామాజిక సిద్ధాంతమైన మార్క్సిజం బావవాదానికి వ్యతిరేక సంఘర్షణలో ముఖ్యపాత్ర వహిస్తున్నది.

మత భావాలను వ్యతిరేకించడంలో..

హేతువాదులు, నాస్తిక వాదులు కమ్యూనిస్టుల కృషి ప్రధానంగా కొనసాగుతున్నది. కానీ వీరిలో కొంతమంది గుంపులో గోవిందగా బతుకుతున్నారు .

ప్రజల విశ్వాసాలను గౌరవించాలనే పేరుతో ఏదో ఒక మేరకు మతాచారాలను కొనసాగించేవారు ప్రజలకు శాస్త్రీయమైన అవగాహన పేరుతో సిపిఐ నారాయణ లాగా మాట్లాడితే నవ్వుల పాలవుతారు. ద్వంద్వ ప్రవృత్తి అవకాశవాదం అవుతుంది.భౌతిక వాదులు అనుకునే వారు ఎవరైనా ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో భౌతిక వాద దృక్పథంతోనే ఉండాలి. తమ ఆచరణ జీవితమంతా మత ఆచారాల పట్ల వ్యతిరేకంగానే ఉండాలి.మత భావజాలానికి వ్యతిరేకంగా పోరాడడం అంటే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిపే పోరాటం ద్వారా మాత్రమే ప్రజలను నిరంతరం చైతన్యవంతం చేయవలసి ఉంటుంది.

 

 

8 సెప్టెంబర్ 2024

జంపన్న

మార్క్సిస్ట్ లెనినిస్ట్ రచయిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *