కేటీఆర్ ట్వీట్ కు మంత్రి సీతక్క కౌంటర్
– హంతకులే సంతాపం పలికినట్టు ఉంది
– సర్పంచ్ లకు బిల్లులు నోచుకోలేదు
కేటీఆర్ ట్వీట్ కు మంత్రి సీతక్క కౌంటర్
హైదరాబాద్, ఆర్ పి న్యూస్:
కేటీఆర్ తీరు హంతకులే సంతాపం పలికినట్టు ఉంది. మీ హయంలో పంచాయతీలకు నిధులు, సర్పంచ్ లకు బిల్లులు ఏళ్ల తరబడి చెల్లింపులకు నోచుకోలేదు అని మంత్రి సీతక్క మాజీ మంత్రి కే టీ ఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు.అన్ని శాఖల్లో కలిసి 72 వేల కోట్ల పెండింగ్ బిల్లులను వారసత్వంగా వదిలిపోయారు. ఆ పాపాన్ని ఇప్పుడు మా ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. మీ అస్థవ్యవస్థ పాలన తో పల్లెలను నిర్లక్షం చేసి ఊపర్ షేర్వాణి, అందర్ పరేషానిలాగా మార్చారు అని వెల్లడించారు. మీ ఏలుబడిలో తెలంగాణలో విజృంభిస్తున్న విష జ్వరాలు, పడకేస్తున్న ఏజెన్సీ పల్లెలు, ఆస్పత్రికి క్యూ కడుతున్న జనం, విష జ్వరాలతో ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిట, ఏజెన్సీ పల్లెలను హడలెత్తిస్తున్న జ్వరాలు, ఏజెన్సీలో హెల్త్ క్యాంపులు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో జ్వర బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు, విష జ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలరోజుల వ్యవధిలో 42 మంది మృతి వంటి కథనాలు పత్రికల్లో వందల సంఖ్యలో వచ్చినా మీరు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు. మీ పాలనలో ఊర్లకు ఊర్లే విషజ్వరాల బారిన పడిన సంగతిని మర్చిపోయారా? మేం చేపట్టిన చర్యల వల్ల ఇప్పుడు అటువంటి పరిస్ధితులు లేవు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాధారణంగా నమోదు అయ్యే కేసులు గతంతో పోలిస్తే పెరగలేదు. పారిశుధ్య, డ్రైనేజీ నిర్వహణ, దోమల మందుకు, బ్లీచింగ్ పౌడర్ కు ఎక్కడా నిధుల కొరత లేదు.20 నెలలుగా రాష్ట్ర ఆర్దిక సంస్థ నిధులు అందలేదని అంత పెద్ద అక్షరాలతో మీరు ట్వీట్ చేసిన పత్రికలో రాస్తే..దాన్ని 8 నెలలుగా రాష్ట్ర ఆర్దిక సంస్థ నిధులు ఇవ్వలేదని పచ్చి అబద్దాలను చెప్పడం మీకే చెల్లింది. మీ పాపాన్ని మా ఖాతాలో వేయాలని చూడటం మీ దిగజారిన రాజకీయానికి పరాకాష్ట. 15వ ఆర్దిక సంఘం నిధులు, ప్రత్యేక గ్రాంట్లను పంచాయతీల అవసరానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నాం అని నొక్కి చెప్పారు. సర్పంచ్ లు చేసిన పనుల బిల్లులను చెల్లించకుండా ఏండ్లుగా పెండింగ్ లో పెట్టిన మీరు, ఇప్పుడు ఎనిమిది నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లులను చెల్లించడం లేదని గగ్గోలు పెట్టడం హస్యాస్పదం. గ్రామ పంచాయతీలను సంక్షోభంలో నెట్టి, ఎందరో సర్పంచ్ ల ఉసురు తీసిన మీకు, ఇప్పుడు వారి పట్ల సానుభూతి వచనాలు పలికే నైతిక అర్హత ఉందా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసిన పనులకు బిల్లులు రాక మీ సొంత జిల్లా సిరిసిల్ల లోని ఇల్లంత కుంట మండలం, సోమారంపేట సర్పంచ్ వడ్డే ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు మౌనంగా ఉన్న మీకు ఇప్పుడు మాట్లాడే హక్కు ఉందా మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. ఇక ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేస్తే నిధులెక్కడికి పోయాయి? పల్లెలు అభివృద్దికి ఎందుకు నోచుకోలేకపోయాయి? ఆ చేయితో ఇస్తూ ఈ చేయితో పంచాయితీల నిధులు కాజేసీన గతం మీ ప్రభుత్వానిది. సర్పంచ్ లకు తెలియకుండానే కేంద్ర నిధులను దొంగ చాటుగా దారి మల్లించిన చరిత్ర మీది. గ్రామ పంచాయతీ వ్యవస్థలను సర్వ నాశనం చేసి..అధికారం పోయిందన్న నిరాశా నిస్ప్రుహతో మేము
ఎనిమిది నెలల్లో ఏం చేయలేదన్నట్లు మీరు ట్విట్టర్ లో ఎంత మొత్తుకున్నా ప్రజలు వినే పరిస్థితి లేరని జోస్యం చెప్పారు. వ్యవస్థలను మీరు నాశనం చేసినంత సులువుగా నిర్మించడం కష్టం. దాన్ని గుర్తెరిగి మా ప్రభుత్వం మీద బురదచల్లడం మానుకుని, గ్రామ స్వరాజ్యాల పునర్నిర్మాణానికి సహకరించండి అని సీతక్క హితవు పలికారు.