సమస్యలకు నిలయాలుగా గురుకులాలు
సమస్యలకు నిలయాలుగా గురుకులాలు
-ఆవుల నాగరాజు
పిడిఎస్ఎఫ్
(రాష్ట్రఅధ్యక్షులు)
ఫోన్: 9618566356
సమాజ మార్పులో విద్య ముఖ్య పాత్ర పోషిస్తుంది. అది సామాజికమైనది. ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంటుంది.కానీ విద్యారంగం ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేజీ నుండి పీజీ ఉచిత విద్య అందరికీ సమానంగా అందాలని డిమాండ్ రూపొందించుకొని పోరాడాము.స్వరాష్ట్రం లో ఉద్యమ ఆకాంక్షలను మేము నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం కేజీ నుండి పీజీ ఉచిత విద్య విధానంలో భాగంగా నాణ్యమైన విద్యతో పాటు, వసతులతో గురుకులాలను తీసుకొస్తున్నామని ప్రకటించింది. ఆ కొద్దిమందికి ఏర్పాటు చేసిన గురుకులాలను ఊరికి చివరగా విసిరేసినట్టు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీలుగా విభజించారు. కార్మికుల పిల్లలైన,కలెక్టర్ పిల్లలైన ఒకే తరగతి గదిలో చదువుకునే కామన్ స్కూల్ విద్యా విధానం మా లక్ష్యం అని వాగ్దానం చేశారు. దీనిలో భాగంగానే మీము ముందుకు వెళ్తున్నామని చెప్పి విధానపరంగానే క్రమ క్రమంగా గురుకులాలను నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు.
గురుకుల విద్య మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న పేద విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ప్రభుత్వ విధానాల మూలంగా చాలా మంది సీటు సంపాదించుకున్నప్పటికి విద్యార్థులు క్యాంపస్ వాతావరణం చూశాక ఇంటికి తిరుగు ముఖం పడుతున్నారు. ఫలితంగా తిరిగి మరల ప్రైవేట్ విద్యా సంస్థలను ఆశ్రయించి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న అడ్మిషన్ తీసుకుంటున్నారు.రాష్ట్రవ్యాప్తంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న గురుకులాల్లో వసతులు లేవు,పౌష్టికాహారం అందటం లేదు, సెక్రటరీ నుండి కిందిస్థాయి అధికారుల వరకు ఎక్కడ పర్యవేక్షణ ఉండటం లేదు,అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరపకుండా సిబ్బంది అవినీతికి,అక్రమాలకు పాల్పడుతున్నారు. సీట్లను అంగట్లో సరుకుగా మార్చి వేశారు, ఎటువంటి అనుమతులు లేకుండా పట్టణాల నుండి గ్రామస్థాయి వరకు విస్తరించిన కోచింగ్ సెంటర్లు, వాటి నిర్వాహకులతో పాటు, కొందరు దళారులు ఈ దందాను నిర్వహిస్తున్నారు. గతం కంటే ప్రస్తుతం అన్ని రకాల వసతులు మెరుగుపడ్డాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో వారు చెబుతున్నట్టుగా లేదని ప్రజలే గ్రహించారు.
కనీసం నిర్దేశించిన మెను పాటించడం లేదు. అన్నం ముద్దల ముద్దలుగా నీళ్ల చారుతో, రుచి లేని కూరలు, పలసని మజ్జిగతో భోజనం కడుపునిండా తినకుండా విద్యార్థులు అర్థాకలితో అలమటిస్తున్నారు. నిత్యం ఏదో ఒకచోట కల్తీ ఆహారం తిని అస్వస్థతతకు గురై హాస్పటల్లో చేరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు సూపర్వైజర్ లు అందుబాటు లేకపోవడం మూలంగా సమయానికి వైద్యం అందక విద్యార్థులు చనిపోతున్నారు.
సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలం దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న కొంపల్లి సరస్వతి అధికారుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయింది. తల్లిదండ్రుల కడుపుకోతలకు బాధ్యులు ఎవరు? ఈ చావులకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.
850 గురుకులాల్లో సొంత భవనాలె లేవు. అద్దె భవనాలులో కొనసాగుతున్న వాటిలో విద్యార్థుల సంఖ్యకు సరిపడ లేవు. సొంత భవనాలు కట్టించాలని డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు స్థలం దొరకడం లేదంటున్న ప్రభుత్వం వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మకానికి పెడుతుంది.పుస్తకాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు,కంప్యూటర్లు లేవు.బోధన,బోధనేతర సిబ్బంది సరిపడలేరు.చాలావరకు పంట పొలాల నడుమ ఏర్పాటు చేసిన హాస్టల్లో లో కనీసం ప్రహరీ నిర్మించకపోవడం మూలాన అనేక చోట్ల విద్యార్థులు విష సర్పాల కాటుకు గురవుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒకచోట ఎలుకలు పీక్కు తింటున్నాయి అనే వార్తలు వింటూనే ఉన్నాము. పారిశుద్ధ్యం లోపించి దోమలతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. డోర్లు సరిగా లేవు, కిటికీలు బెంచీలు లేక కింద కూర్చుని చదువుకుంటున్న కాలేజీలు ఉన్నాయి. త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది.బాత్రూమ్స్ లేక ఆరు బయటకు వెళ్తున్నారు.
స్వేచ్ఛ వాతావరణం లో ఆనంద నిలయాలుగా మారి సృజనాత్మకంగా విజ్ఞానం వైపు అడుగులు వేయాల్సిన గురుకులాలు నిర్బంధ కేంద్రాలుగా మారాయి. విద్యార్థిని విద్యార్థులు ఉరికొయ్యలకు వేలాడుతూ, బలవంతపు చావులకు నెట్టి వేయబడుతున్నారు.విద్యార్థినిలు మానసికంగా,శారీరకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు.విద్యార్థి సంఘాలను గాని, సామాజిక ,మహిళ సంఘాలను కనీసం తల్లిదండ్రులను కూడా లోపలికి అనుమతించడం లేదు. అధికారుల అలసత్వం మూలంగా విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కళాశాల విద్యార్థినిలు వారం రోజులపాటు ఆందోళన చేస్తే ఆ కళాశాల ప్రిన్సిపల్ నుండి పోలీసు అధికారుల వరకు అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేశారు. విసిగిపోయిన విద్యార్థిలు భోజనం చేయకుండా నిరసన తెలియజేస్తూ కాలి నడకన 15 కిలోమీటర్లు నడుస్తూ సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చేరుకొని అర్ధరాత్రి వరకు ధర్నా చేశారు. అక్కడ నుండి తరలించి హాస్టల్ గదుల్లో విద్యార్థినిలను నిర్బంధించారే తప్ప వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించలేదు. తర్వాతే ఏం జరిగిందనేది నేటికీ బయట సమాజానికి తెలియనీయలేదు.అనేక చోట్ల ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల రక్తంతో తడిసిన ఈ నేలన వారి త్యాగాల పునాదుల మీద ఎవరు అధికారం చేపట్టిన విద్యా వ్యవస్థ మారలేదు.
ప్రజా పాలన తీసుకొస్తామని అధికారం చేపట్టిన ఫ్యూడల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలనే అవలంబిస్తూ రాజ్య స్వభావాన్ని బయటపెట్టింది. తెలంగాణలో విద్యా వ్యాపారానికి అడ్డుకట్ట వేసి చట్టం తీసుకొస్తామని పేద వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న మాటను నిలబెట్టుకోలేకపోయింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను,గురుకులాలను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కుల మత వివక్షత లేకుండా ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని తీసుకువస్తాం అని స్పష్టమైన విధానం లేకుండా ప్రకటనలు ,సమీక్షల తో సరిపెడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల నెరవేర్చాలి.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలను గురుకులాలుగా మార్చాలి .చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రవేశ పరీక్ష విధానం లేకుండా అడ్మిషన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని గుర్తేరగాలి.