అర్హులైన పేద రైతులకు తీవ్రంగా నష్టం : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

0

అర్హులైన పేద రైతులకు తీవ్రంగా నష్టం

మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి

నిడమనూరు, ఆర్ పీ న్యూస్ :

ప్రభుత్వ నిర్ణయం వల్ల అర్హులైన పేద రైతులకు తీవ్రంగా నష్టం… మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల అర్హులైన పేద రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని షరతులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తింపజేయాలని మాజీ శాసనసభ్యులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నిడమనూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధరణిలో లోపాల వల్ల రైతులకు పాసు పుస్తకాలు అందలేదని, ఇది ప్రభుత్వ లోపం అని దీని కారణంగా రుణమాఫీ వర్తింప చేయకపోవడం రైతుకు నష్టమేనని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గా వ్యవసాయం కోసం రైతులు తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అనేకమంది సన్నా చిన్నకారు రైతులు, కౌలు రైతులు వ్యవసాయం కోసం వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చారని, పేద రైతులు, కౌలు రైతులు బంగారం తాకట్టుపెట్టి బ్యాంకుల వద్ద పంట రుణాలు తెచ్చారని వారిని ప్రభుత్వం రైతులుగా గుర్తించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకు రుణాలు రీ షెడ్యూల్ చేసిన వారికి, జే ఎల్. జి.కౌలు, రైతు మిత్ర గ్రూపుల ద్వారా ఇతర అవకాశాలను బట్టి రైతులు వ్యవసాయం కోసం అప్పులు తెచ్చారని అన్నారు. ప్రభుత్వం చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ చేయాలి కానీ దీనికి రెండు లక్షల పైన ఉన్న బాకీలు ముందుగా చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుంది అనడం సరైంది కాదని, ప్రభుత్వం చేయాల్సింది చేయాలని, మిగతాది బ్యాంకులు రైతులు మధ్య అవగాహనతో వెసులుబాటును కల్పించుకొని తీర్చే ప్రయత్నం చేస్తారు తప్ప ఇలాంటి షరతులు సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. కుటుంబంలో ఒకరికి రుణమాఫీ వర్తిస్తుంది అంటే మిగతావారు రైతులు కాకుండా పోతారా… పట్టాదారు పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరు రైతులేనని అందరికీ వర్తింపజేయాలని, కుటుంబ ప్రాతిపదిక సరైన నిర్ణయం కాదని అన్నారు. వ్యవసాయం కోసం తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను ప్రభుత్వం చిత్తశుద్ధితో రుణమాఫీ చేస్తేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతు భరోసా డబ్బులు కూడా ప్రజల అకౌంట్లో వేసి పెట్టుబడులకు సాయపడాలని, రైతులు మరల దళారుల వద్దకు ప్రైవేటు వడ్డీ వ్యాపారు దగ్గర వెళ్లి దగాకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రవ్యవసాయ రంగం అభివృద్ధికి నిపుణులతో సంప్రదించి సరైన వ్యవసాయ ప్రణాళికను రూపొందించి సమగ్రంగా పకడ్బందీగా అమలు చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరు కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *