తెలంగాణ ప్రజలను వంచించే బడ్జెట్ :మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
తెలంగాణ ప్రజలను వంచించే బడ్జెట్ : మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
అందోల్, ఆర్ పి న్యూస్:
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజలను వంచించినట్టుగా ఉందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఈ బడ్జెట్ చూస్తుంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసినట్టు కనిపిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం అమలు చేసిన వాటికంటే భిన్నంగా ఇస్తామని అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈ బడ్జెట్ చూస్తుంటే గత ప్రభుత్వం అమలు చేసిన వాటికి కూడా సరియైన కేటాయింపులు చేయలేదు దీన్ని బట్టి వాటిని అమలు చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదని మండిపడ్డారు. దళిత బంధు, బిసి బంధు, మైనార్టీ బంధు ల ఊసే కనిపించలేదు. యాదవ సోదరులకు చేయూతనిచ్చే గొర్రెల పంపిణీ ముదిరాజ్ సోదరులకు తోడ్పాటునందించే చేపల పంపిణీకి కూడా కేటాయింపులు చేయకపోవడం చూస్తుంటే వీటన్నింటిని అటకెక్కించినట్టే అర్థం అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని, ఆందోల్ నియోజకవర్గంలోని దళితులందరికి దళిత బంధు ఇస్తాం అని హామీ ఇస్తే దానికి ప్రతిగా మేము కూడా అందరికి ఇస్తాం అంతకంటే మరో రెండు లక్షలు ఎక్కువ ఇస్తాం అని డంకా బజాయించి ప్రచారం చేశారు దామోదర రాజనర్సింహ అని, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చంటి క్రాంతి కిరణ్ ఏద్దేవా చేశారు.