ఏపీ లో కూటమి సునామిలో వైసీపీ గల్లంతు
ఏపీ లో కూటమి సునామిలో వైసీపీ గల్లంతు
హైదరాబాద్,ఆర్ పీ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామి సృష్టించింది. ఈ సునామిలో వైసీపీ కొట్టుకుపోయింది. ఏపీ లో బిజెపి,టీడీపీ, జనసేన కూటమిదే హవా నడుస్తుంది. వైసీపీ కి ఏపీ ప్రజలు ఓటమిని కట్టబెట్టారు. వైస్ జగన్ సంక్షేమ పథకాల మంత్రం ఏమాత్రం పనిచేయలేదు. ప్రభుత్వం పై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతను జగన్ గుర్తించలేక పోయారు. ప్రభుత్వ వైఫల్యాలే జగన్ ను ఓడించాయి. తమ పన్నులతో ఎవరికో డబ్బులు పంచడం, పథకాలు అందరికీ అందకపోవడం, పెరిగిన నిత్యావసర ధరలు, గ్రామాల్లో వాలంటీర్లు రాజ్యమేలడం, సలహా దారులను మాత్రమే నమ్ముకోవడం, అభివృద్ధి లేకపోవడం.. ఇంకా ఎన్నో అంశాలను అర్ధం చేసుకోలేక వైస్ జగన్ సామాన్యుడికి దూరమై ఘోర ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి వైస్ జగన్ కు భారీ షాక్ అనే చెప్పవచ్చు. వైసీపీ తన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది.
కూటమి సునామి
ఏపీ లో ఎవరూ ఊహించని విధంగా కూటమి విజయ కేతనం ఎగురవేసింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ అధినేత నాయుడు ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. రికార్డుస్థాయిలో టీడీపీ ఆదిక్యం సాధించుకుంది. మంగళగిరి లో నారా లోకేష్ బాబు చరిత్రను తిరుగరాశారు.టీడీపీ దశాబ్దాలుగా గెలువని మంగళగిరి నియోజకవర్గం లో నారా లోకేష్ బాబు తెదేపా జెండా ఎగురావేశారు. 1985 నుంచి ఇప్పటి వరకు టీడీపీ అక్కడ గెలువలేదు.అయితే మంగళగిరి ని లోకేష్ ఆంటీపెట్టుకొని ఉండటం వల్ల సక్సెస్ అయ్యారు.టీడీపీ ఆధిక్య సీట్లను సాధించడంతో తెలంగాణ లో హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. వైసీపీ ఇలాఖా కడప లో టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నుంచి మాధవి రెడ్డి వైసీపీ డిప్యుటీ సీఎం అంజాద్ భాష పై విజయం సాధించారు.
జనసేనాని జయ కేతనం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో ప్రచారం చేపట్టారు. వైస్ జగన్ వైఫల్యాలను ఎండగట్టారు. కూటమిలో భాగంగా 21 స్థానాల్లో జనసేన ఆదిక్యత ను ప్రదర్శించింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో గెలవడం ఆ పార్టీ శ్రేణుల్లో, ఆయన అభిమానులకు నూతన ఉత్సాహం వచ్చింది. ఏపీ లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోనుంది జనసేన. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసు కు శాశ్వత గుర్తు లభించనుంది. పవన్ కళ్యాణ్ గెలుపు పట్ల తన కుటుంబ సభ్యులు భావొద్వేగానికి గురయ్యారు.జనసేన కార్యకర్తలు స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.