అమరుల స్వప్నం మిగిలే ఉంది
అమరుల స్వప్నం మిగిలే ఉంది
By K Rajendra Prasad
Telangana Journalist Front
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం దాశాబ్ది ఉత్సవాలు జరుపుతుంది. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన..నీళ్లు,నిధులు, నియామకాల కోసం సాగిన స్వరాష్ట్ర పోరాటంలో ఎన్నో త్యాగాలు, మరెన్నో బలిదానాలు ఉన్నాయి. మా నీళ్లు మా కొలువులు, మా భూములు మాకే కావాలంటూ మర్లబడ్డ తెలంగాణకు పోరాట పటిమ ఉంది, ధిక్కార స్వరం ఉంది. సమైక్య ఆంధ్ర పాలనలో తెలంగాణ వివక్షకు గురవుతున్నదని మేధావులు,బుద్ధి జీవులు కవులు,కళాకారులు, ప్రజా సంఘాల సభ్యులు ప్రజాస్వామిక వాదులు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమని పల్లె పల్లె తిరుగుతూ ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. కళాకారులు కాళ్లకు గజ్జ కట్టి ఆంధ్ర పెట్టుబడుదారులు తెలంగాణపై చేస్తున్న వివక్ష గురించి అనేక పాటలు పాడి ప్రజలను చైతన్యవంతం చేశారు. ఇలా తెలంగాణలో ఏ పల్లెను తట్టి లేపినా వందలాది మంది కళాకారులు రోడ్డెక్కి దగాపడ్డ తెలంగాణ గోసను పాటలు పాడుతూ ప్రజలకు వివరించారు. తెలంగాణ జన సభ, తెలంగాణ మహాసభ లాంటి ఎన్నో సంస్థలు తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటం చేశాయి. అయితే ఈ పోరాటాన్ని రాజకీయంగా తీసుకెళ్లాలని,పార్లమెంట్ లో బిల్లు పెట్టించి సాధించాలని కెసిఆర్ టీ ఆర్ ఎస్ ను స్థాపించారు. ప్రొఫెసర్ జయశంకర్, గాదె ఇన్నయ్య, చెరుకు సుధాకర్ లాంటివాళ్ళు అనేకమంది కేసీఆర్ వెన్నంటే ఉండి ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేశారు. ఉస్మానియా, కాకతీయ, యూనివర్సిటీల తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రోడ్డెక్కి గర్జించారు.ఒక దశలో మిలీటెన్సీ పోరాటన్ని సైతం నడిపించారు.తెలంగాణ వస్తే భవిష్యత్ తరాలు బాగుపడతాయని,స్వేచ్ఛ సమానత్వం, నీళ్లు, నిధులు,నియామకాలు వస్తాయని తమ చదువులకు స్వస్తి చెప్పి నిరంకుశ సమైక్య పాలనపై సమరభేరి మోగించారు విద్యార్థులు. అయితే 1969 తొలిదశ పోరాటంలో సమైక్య పాలకుల కాల్పుల్లో వందలాది విద్యార్థులు చనిపోతే మలిదశ తెలంగాణ పోరాటంలో వందలాది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. నాటి చంద్రబాబు పాలనలో తెలంగాణ పదం ఎత్తుతేనే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. చంద్రబాబు నాయుడు మాట, ఆట, ఆట పై నిర్బంధం ప్రయోగించారు. తెలంగాణ పాట పాడిన బెల్లి లలితక్కను ముక్కలు ముక్కలుగా నరికి ఇంకోసారి ఎవరైనా తెలంగాణ పేరు ఎత్తుతే ఇదే పరిస్థితి ఉంటుందని నాటి నరహంతక బాబు ప్రభుత్వం హెచ్చరించారు. ప్రజా గాయకులు గద్దర్ పై తుపాకులు ఎక్కిపెట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గద్దర్ కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. అయినా మడమ తిప్పకుండా గద్దర్ తెలంగాణ ప్రజల కోసం ప్రజా తెలంగాణ ఏర్పడాలని పాటలు పాడాడు. దోపిడీ,పీడన, అసమానతలు లేని తెలంగాణ ఏర్పడాలని, స్వేచ్ఛ, సమానత్వం, పౌర హక్కులు వర్ధిల్లాలని అమరులు కలలు కన్నారు. అనన్య త్యాగాల ఫలంగా ప్రత్యేక రాష్ట్రం సిద్దించింది.కానీ వచ్చింది భౌగోళిక తెలంగాణ మాత్రమే సంపూర్ణ తెలంగాణ ఏర్పడలేదు. ప్రజల ఆకాంక్షలు , అమరుల స్వప్నం ఈ పదేళ్ల తెలంగాణ లో నెరవేరలేదు. ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చాక రాజకీయ పార్టీగా అవతరించింది. టీ ఆర్ ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చి కెసిఆర్ సీఎం అయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు.తెలంగాణ రూపురేఖలు మారుస్తా. బొంబాయి,దుబాయి వలసల బతుకులను మారుస్తా అని చెప్పాడు. ఒకానొక సందర్భంలో పౌర హక్కుల కార్యకర్తగా ఉంటానని కేసీఆర్ చెప్పారు. మావోయిస్టుల ఎజెండా నే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ పదేళ్ల కాలంలో ఒక నియంతలాగ పరిపాలన కొనసాగించి ప్రశ్నించే గొంతుకలపై ఉక్కుపాదం మోపి కార్పొరేట్ వ్యవస్థను ప్రోత్సహించి అమరుల ఆకాంక్షలను నీరు గార్చి ప్రతిపక్షమే లేకుంటా చేసి ఫ్యూడల్ పాలనను కొనసాగించారు కేసీఆర్. కెసిఆర్ పాలనపై విసుగుచెందిన నేటి సీఎం రేవంత్ రెడ్డి నక్సలైట్లు ఉంటే బాగుండునేమో అని చెప్పిన సందర్భం ఉంది. టిఆర్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులను, సంస్థల్లో పనిచేసిన ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను సైతం కెసిఆర్ విస్మరించారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కెసిఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు గద్దె దించారు.ప్రజా పాలన పేరుతో, ఆరు గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మర్చి, జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించి,లోగోలను మార్చి ఇదే ప్రజా తెలంగాణ అని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజా తెలంగాణ అంటే ఇది కాదు..అమరుల ఆకాంక్షలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలి. స్వేచ్ఛ, సమానత్వం, పౌర హక్కులు కాపాడుతూ, ప్రజాస్వామ్యంను అమలు చేసే దిశగా సీఎం అడుగులు వేయాలి.ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇక్కడి మట్టివాసులకు అందేలా రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలి.